కేసీఆర్ లేరని .. చెరువులో చేపలు మాయమయ్యాయి : మల్లారెడ్డి

 


రాజకీయాలలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి స్టైలే వేరు. ‘పూలు అమ్మినా.. పాలు అమ్మినా ’ అంటూ ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు. వేదికపై మల్లారెడ్డి మైక్ అందుకుంటే చాలు జనాల్లో ఊపు వస్తుంది. తనదైన శైలిలో పంచ్‌లు విసురుతూ జోష్ నింపడం మల్లన్న స్టైల్. ఎక్కడున్నా తాను నవ్వుతూ.. నలుగురిని నవ్విస్తూ వుంటారు మల్లారెడ్డి. 2023 తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికి మల్లారెడ్డి మాత్రం తగ్గడం లేదు. 

తాజాగా తన అధినేత , మాజీ సీఎం కేసీఆర్‌పై మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు మల్లారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఏ చెరువు చూసినా కేసీఆర్, ఏ ఫ్లై ఓవర్ చూసినా కేటీఆర్ కనిపించేవాళ్లని అన్నారు. చెరువులు చేపలతో కళకళలాడుతూ ఉండేవని .. ఆ చేపలన్నీ ఎక్కడికి వెళ్లాయోనంటూ మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 46 వేల చెరువులు మే, జూన్ నెలల్లో నిండు కుండల్లాగా ఉండేవని .. కేసీఆర్ లేరని అవన్ని మాయమైపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో వర్షాలు , చెరువులు , పంటలు మాయమైపోయాయని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లు లక్ష ఎకరాల పంటలకు నీటిని వదలకుండా నాశనం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో కుంగిన మూడు పిల్లర్లు వదిలిపెట్టి , మిగిలిన వాటి ద్వారా నీటిని వదలొచ్చని .. కానీ కాంగ్రెస్ వాళ్లకు చేతకావడం లేదన్నారు. కాళేశ్వరం వల్ల కేసీఆర్‌కు పేరొస్తుందని.. ఆయనను ఎలాగైనా బద్నాం చేయాలని ఇలా చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. 

రాష్ట్రంలో వాటర్ ట్యాంకర్లు, ఇన్వర్టర్లు , జనరేటర్లు తిరుగుతున్నాయని .. పశువులు తాగేందుకు కూడా నీళ్లు లేవన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేయాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఆగస్ట్ 15 నాటికి రైతు రుణమాఫీ అమలు చేస్తామని ఎలా చెబుతున్నారో, అలాగే మిగిలిన వాటిపైనా క్లారిటీ ఇవ్వాలన్నారు. లోక్‌సభ ఎన్నికల వరకు మాయమాటలు చెప్పారని మల్లారెడ్డి దుయ్యబట్టారు. 


Comments